Patanjali Yoga Sutras - verses (1 - 11)
1 - ఇప్పుడు యోగశాస్త్రము చెప్ప బడుచున్నది.
‘యుజ్’ అనే సంస్కృతధాతువు నుండి ‘యుజిర్ యోగ’ మనే నిర్వచనం వచ్చింది. ‘కలయిక’ యని దీని అర్థం. వ్యాసమహర్షి తన యోగసూత్రభాష్యంలో ‘యుజ్ సమాధౌ’ అంటూ, యోగమంటే సమాధిలో లీనం కావడమని అన్నారు. కనుక, కలయికయని మూలార్థమైనప్పటికీ, ఏకాగ్రతయని, సమాధియని కూడా ఈ పదమునకు అర్థములున్నాయి.
దేనితో దేని కలయిక? అంటే, జీవాత్మ, పరమాత్మల కలయికయని అర్థం. జీవాత్మయంటే, పరిమితమైనట్టి యోగియొక్క ఆత్మ. పరమాత్మయంటే, అన్ని ఆత్మలకు మూలమైన, ఆధారమైన, అనంతమైన విశ్వాత్మ . పరిమితమైన మానవాత్మ , అపరిమితమైన దైవాత్మతో కలవడమే యోగం. దీనికి మార్గం ఏకాగ్రతాపూర్వకమైన కేవలసమాధిని అనుభవం ద్వారా అందుకోవడం. కనుక యోగమంటే పరమాత్మతో ఏకాగ్రతాపూర్వకమైన సంయోగమని అర్థం వస్తుంది. ఈ సమాధిని అందుకునే విధానమును యోగశాస్త్రం ఉపదేశిస్తుంది.
2 - యోగమంటే చిత్తవృత్తి నిరోధం.
చిత్తము, వృత్తులు, నిరోధము అనే పదములను అర్థం చేసుకోవాలి.
చిత్తమంటే - చింతించునది, ఆలోచించునది. మనస్సు అనే పదమును కూడా ఇదే అర్థంతో వాడుతూ ఉంటారు. మనస్సు అంటే మననం చేసేదని, చిత్తమంటే చింతించేదని అర్థములు. మననం కంటే, చింతన లోతైనది. కనుక లోతైన ఆలోచనను చేసేదే చిత్తమని అర్థం.
వృత్తులంటే - ఆలోచనలు, ఊహలు, భావపరంపరలు. సరస్సులో కెరటముల లాగా చిత్తంలో ఆలోచనలు లేస్తూ ఉంటాయి. మనస్సు తననుంచి బయటకు ప్రసరించడమే ‘వృత్తి’. మనస్సులో కలిగే ఏ మార్పు అయినా ‘వృత్తి’ అనబడుతుంది.
నిరోధమంటే - నిరోధించడం, ఆపడం, ఓడించడం అని అర్థములు.
కనుక, చిత్తంలో ఆలోచనలు, ఊహలు, భావములు, లేవకుండా ఆపడమే యోగమని నిర్వచనం.
3 - అప్పుడు ద్రష్ట తన స్వరూపంలో ఉంటుంది.
చూచేవాడు ద్రష్ట. కన్ను అనే ఇంద్రియమును ఉదాహరణగా తీసుకొని ‘చూచేవాడు’ అని చెప్పినప్పటికీ, మిగతా ఇంద్రియములను కూడా లెక్కించినపుడు - వినేవాడు, వాసనను గ్రహించేవాడు, రుచిని తెలుసుకునేవాడు, స్పర్శను తెలుసుకునేవాడు - అని అర్థములు వస్తాయి. దానిని ‘ఆత్మ’ యని యోగసాంప్రదాయం అంటుంది.
ఎప్పుడైతే చిత్తంలో ఆలోచనలు లేవకుండా ఉంటాయో, అలలు లేని సరస్సులాగా, చిత్తం నిశ్చలంగా, నిర్మలంగా ఉంటుంది. అప్పుడు, ఇంద్రియముల నుండి లోకంవైపు అది ప్రసరించదు. తనలో తానుగా ఉంటుంది.
ద్రష్ట అనేది ఉన్నదని ప్రతిపాదించడం ద్వారా, ‘ఆత్మ’ ఉన్నదని మహర్షి మొదట్లోనే చెబుతున్నారు. ఇది సాంఖ్యం నుంచి తీసుకున్న భావన. బౌద్ధంలో అయితే, ఆత్మ అనేది లేదని బుద్ధుడన్నాడు. ‘చిత్తం ఇంద్రియముల ద్వారా లోకంలోకి ప్రసరించి, అనుభవములను పొందినపుడే, ‘నేను’ అనిన స్పృహ పుట్టుకొస్తుంది గాని, అంతకు ముందు అది ఉండదు, ఆ తరువాతా ఉండదు. దానితోనే పుట్టి దానితోనే పోతుంది’ అన్నాడు. దీనిని ‘ప్రతీత్య సముత్పాదం’ అని ఆయన పిలిచాడు. కనుక బౌద్ధంలో చిత్తమే ఆఖరుది. దానిపైన ఆత్మ లేదు. ఆత్మ లేదు గనుక పరమాత్మా లేదు. అందుకే అది అనాత్మవాదమైంది.
చిత్తంలో ఆలోచనలు లేవకుండా ఉన్నపుడు ఆత్మ ఆత్మగా, తనలో తానుగా ఉంటుందని అర్థం. దీనినే స్వస్థితి యని, స్వాత్మస్థితి యని అంటారు.
4 - ఇతరత్రా అయితే వృత్తులతో సారూప్యస్థితిలో ఉంటుంది.
సారూప్యమంటే, సమానమైన రూపమని అర్థం. ‘ఇతరత్రా’ అంటే, ఆలోచనలు లేస్తున్నపుడని అర్థం. ఆలోచనలు లేస్తున్నపుడు, ఆత్మ వాటితో సారూప్యమైన స్థితిలో ఉంటుంది. లేకపోతే, తనలో తానై ఉంటుంది.
ఈ సూత్రం నుంచి, వృత్తులు ఎన్ని విధములు? అవి ఎలా ఉంటాయి? అనిన ప్రశ్న ఉదయిస్తుంది.
5 - క్లిష్టములు, అక్లిష్టములైన వృత్తులు అయిదు విధములు.
వృత్తులు - అయిదు విధములు
స్థూలముగా, వృత్తులు రెండు విధములు. క్లిష్టములంటే దుఃఖమును కలిగించేవి, ఇబ్బంది పెట్టేవి. అక్లిష్టములంటే, దుఃఖమును కలిగించనట్టివి, ఇబ్బంది పెట్టనట్టివి. ఇవి మళ్ళీ ఒక్కొక్కటి అయిదు విధములుగా ఉంటాయి.
ఆలోచనలు, సంకల్పములు, మనసులోని మార్పులు - దుఃఖమును కొనితెచ్చేవి, దుఃఖమును తీసుకురానివి - అని స్థూలముగా రెండు విధములు. మళ్ళీ వీటిలో అయిదు తేడాలు ఉంటాయి.
6 - ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి - అనేవి ఆ అయిదు రకములు.
ఇవేమిటో ఒక్కొక్కదానిని వివరిస్తున్నారు.
7 - ప్రమాణం మూడు విధములు - ప్రత్యక్షం, అనుమానం, ఆగమం. ఒక విషయమును మనం గ్రహించడానికి ఈ మూడువిధములైన దారులు ఉంటాయి.
ప్రమాణములు - మూడు విధములు
మొదటిది ప్రత్యక్షం. అంటే, దేనినైనా, మనంతట మనం చూచి, అనుభవించి తెలుసుకోవడం. రెండవది, అనుమానం. అంటే, ఆలోచన సహాయంతో ‘ఇది ఇలా ఉండవచ్చు’ అని ఊహించడం. మూడవది ఆగమం. అంటే శాస్త్రప్రమాణం. శాస్త్రములు లేదా మన మేలు కోరేవారు చెప్పినదానిని నమ్మడం. దీనికే ఆప్తప్రమాణమని కూడా పేరున్నది. అంటే, ఆప్తులైనవారు చెబితే నమ్మడమన్న మాట.
ఈ భావములన్నీ మూడువేల సంవత్సరముల క్రిందటిదైన సాంఖ్యదర్శనం లోనివి. సాంఖ్యం నుంచి యోగదర్శనం వీటిని గ్రహించింది.
ఈశ్వరకృష్ణుని ‘సాంఖ్యకారిక’ ప్రకారం, ఏదైనా ఒక విషయమును గ్రహించడం ఈ క్రింది మూడు విధములుగా మాత్రమే సాధ్యమౌతుంది.
ప్రత్యక్షప్రమాణం - ఇంద్రియముల ద్వారా సూటిగా ఒక విషయమును తెలుసుకోవడం.
అనుమానప్రమాణం - ఇంద్రియములకు అతీతమైన విషయమును దీనిద్వారా తెలుసుకోవాలి. అంటే, కనిపించేదానిని బట్టి కనిపించని దానిని ఊహించడం. ఉదాహరణకు, పొగ కనిపించినప్పుడు అక్కడ నిప్పు ఉంటుందని ఊహిస్తాము. టపాకాయల ధ్వని వినిపించినప్పుడు, అక్కడ ఎవరో టపాకాయలు కాలుస్తున్నారని ఊహిస్తాము. లేదా, వానాకాలంలో మొక్కలు మొలిచినప్పుడు, మొక్కలు మొలిచాయి గనుక, వాటి విత్తనములు భూమిలో ఉన్నాయని ఊహిస్తాము. విత్తనములు మనకు కనిపించవు. మొక్కలను బట్టి వాటిని ఊహిస్తాము. అదే విధంగా మిగతా ఇంద్రియములకు సంబంధించిన విషయములలో కూడా, మన అనుభవానికి వస్తున్నవాటిని బట్టి, అనుభవానికి ఇంకా అందనివాటిని ఊహిస్తాము. ఇది అనుమాన ప్రమాణం అనబడుతుంది.
ఆగమప్రమాణం లేదా ఆప్తవాక్యం - పై రెండు విధములుగా తెలుసుకోలేని విషయములను దీనిద్వారా గ్రహించాలి. వేదములు, శాస్త్రములు, గురువాక్యములు ఈ కోవలోకి వస్తాయి. ఇంద్రియములకు అతీతమైన విషయములను ఇవి చెబుతాయి. దీనిలో ‘నమ్మకం’ అనేది ప్రధానపాత్రను పోషిస్తుంది. పెద్దలు చెప్పినప్పుడు, దానిని నమ్మి ఆచరించడమే ఆగమం.
ఇంద్రియముల పరిధిలో, మానవుని జ్ఞానసముపార్జనకు ఈ మూడుదారులు తప్ప వేరే దారి లేదు. అంటే - మనంతట మనం చూచి తెలుసుకోవడం, ఆలోచించి గ్రహించడం, ఒకరు చెబితే నమ్మడం - అనే మూడు విధములుగా మాత్రమే మనం ఒక విషయమును తెలుసుకుంటాము.
8 - అది కానిదైన మిథ్యారూపము యొక్క జ్ఞానమే విపర్యయము.
విపర్యయము
అంటే, లేనిదానిని ఉన్నదని భ్రమించడం, ఉన్నదానిని లేదని అనుకోవడం. ఎదురుగా ఉన్నదానిని ఉన్నట్లు చూడకుండా, ఇంకో రకంగా చూచి తప్పుగా అర్థం చేసుకోవడం విపర్యయమౌతుంది. అంటే, ‘మిథ్యాదృష్టి’ యని అర్థం. ‘సత్యదృష్టి’ కలిగినప్పుడు మిథ్యాదృష్టి పోతుంది. నిజమును తెలుసుకున్నపుడు అబద్ధం మాయమౌతుంది.
అయితే, సత్యమును గ్రహించడానికి, ఒప్పుకోవడానికి, మనస్సు అడ్డుపడుతూ ఉంటుంది. దీనికి కారణములు, మనస్సులో ఉండే సుఖాభిలాష, కపటము. ఇవి సుఖమును కోరుకుంటాయి. సత్యం సుఖమునకు ప్రాధాన్యతనివ్వదు. కనుక లోకులందరూ విపర్యయమును కోరుకున్నట్లుగా సత్యదృష్టిని కోరుకోరు.
9 - వస్తువు లేకుండా, శబ్దజ్ఞానమును మాత్రమే అనుసరించేది వికల్పం.
వికల్పము
అంటే, వస్తువును గురించిన యథార్థజ్ఞానం లేకుండా, ఉత్తమాటలను బట్టి ఒక అవగాహనకు రావడమని అర్థం. దైవానుభవం లేకుండా, శాస్త్రములు చదివి మాటలు చెప్పడం ఈ కోవకు వస్తుంది. ఎవరో చెప్పిన మాటలను నమ్మడం కూడా ఇదే.
లోకంలో ఎటుచూచినా కనిపించే ‘అనవసరమైన వాగుడు’ లేదా ‘కాలక్షేపం కబుర్లు’ దీని క్రిందకు వస్తాయి. అనుభవం లేకుండా, ఊరకే చేసే ఆధ్యాత్మిక, లౌకిక చర్చలు ‘వికల్పం’ అనబడతాయి.
10 - అభావప్రత్యయం మీద ఆధారపడే వృత్తి, నిద్ర.
నిద్ర
ప్రత్యయమంటే ఒక స్థితి, ఒక ఆధారం. అభావప్రత్యయమంటే ఒక భావమంటూ లేనట్టి స్థితి. అలాంటి స్థితిని పొంది ఉండే వృత్తి (చిత్తం యొక్క స్థితి) - నిద్ర. అంటే, ఏమీ తెలియని అయోమయావస్థ అని అర్థం. నిద్రలో ఉన్నవాడు బయట జరుగుతున్న విషయములను తెలుసుకోలేడు. కనుక అది అభావస్థితి.
11 - అనుభవమైన విషయముల నుంచి బయటపడలేనిది, స్మృతి.
స్మృతి
ఒకసారి ఒక అనుభవాన్ని పొందితే మళ్ళీమళ్ళీ అదే అనుభవం కావాలని అనిపించడమే జ్ఞాపకం లేదా స్మృతి. ఈ స్థితిలో ఉన్న చిత్తం గతంలో తాను పొందిన అనుభవంలో మునిగిపోయి దానినుంచి బయటకు రాలేదు.
క్లుప్తంగా చెపాలంటే ఈ ప్రక్రియ అంతా ఇలా ఉంటుంది. మనస్సు యొక్క మార్పులు: దుఃఖమును కలిగించేవి, కలిగించనివి అని రెండు రకములుగా ఉంటాయి. దీని అయిదు రూపములు: ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతులు.
ఒక విషయమును తెలుసుకుంటున్నపుడు ప్రమాణం, తప్పుగా గ్రహిస్తున్నపుడు విపర్యయం, అనుభవాన్ని వదలి ఉత్తమాటలలో మునిగిపోవడం వికల్పం, అయోమయస్థితిలో పడటం నిద్ర, అనుభవాన్ని మళ్ళీ కోరుకోవడం స్మృతి.
ఈ అయిదు స్థితులకు, వేదాంతములో చెప్పబడిన జాగ్రదాది మూడు అవస్థలకు సామ్యం ఉన్నది. ఒక విషయమును సూటిగా తెలుసుకోవడం గాని, ఊహద్వారా తెలుసుకోవడం గాని, ఒకరు చెబితే విని తెలుసుకోవడం గాని, తప్పుగా తెలుసుకోవడం గాని, ఊరకే మాటలలో వినడం గాని - ఇవన్నీ మెలకువలోనే జరుగుతాయి. కనుక ఇవి జాగ్రదావస్థకు సూచికలు. ఇలా తెలుసుకున్న దానిని జ్ఞాపకంగా నిలుపుకొని ఊహలలో దానిని దర్శించడం స్వప్నావస్థకు సూచిక. వీటినన్నింటినీ మరచిపోయిన గాఢనిద్రాస్థితి సుషుప్తి.
ఈ క్రింది పట్టిక చూడండి.
యోగసూత్రములు | వేదాంతము |
---|---|
ప్రమాణ, విపర్యయ, వికల్పములు | జాగ్రదావస్థ (మెలకువ) |
స్మృతి | స్వప్నావస్థ (కల) |
నిద్ర | సుషుప్తి అవస్థ (నిద్ర) |
చిత్తం యొక్క క్రియాస్థితి (వృత్తి) అనేది ఈ అయిదు విధములుగా ఉంటుంది.
నిష్క్రియాస్థితిలో ఉన్న చిత్తం తనలో తానుగా ఉంటుంది. దానిలో ఈ అయిదు రకములైన మార్పులు ఉండవు. అప్పుడు దాని పూర్వసంస్కారములు తప్ప అందులో ఇంకేమీ చలనం ఉండదు.
ధ్యానస్థితిలో ఉన్నపుడు, ఈ అయిదు విధములైన స్థితులలో చిత్తము పడకుండా చూచుకోవాలి. అదే యోగం.
Thanks for Reading.
Comments
Post a Comment